తెలుగు భాష గొప్పతనం


ప్రపంచ తెలుగుమహాసభల సందర్భంగా
వేదిక ' ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రాత్రి 7-0 గం‌. లకు నేను పఠించిన కవిత

శీర్షిక :తేటతెనుగు భాష నా తెలుగుభాష

రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.

అచ్చమైన భాష.. స్వచ్ఛమైన భాష..
యాబదారు అక్షరాల .. తేనెలొలుకు  భాష .. 
తేటతెనుగు భాష నా... తెలుగుభాష...

అచ్చులతో గుణింతాలు..హల్లులతో ఒత్తులు
అందమైన ఛందస్సు... సరసమైన సంధులు గల
వెన్నలాంటి భాష నా... తెలుగుభాష...

భక్తిభావమైన విభక్తులు... సాటిలేని సమాసాలు
అందమైన అలంకారాలు... ప్రకృతీవికృతుల 
పరిమళించు భాష నా... తెలుగుభాష...

అసమాన ఉపమానాలు.. బాషాకీర్తి పెంచు భాషాభాగాలు
వ్యాకరణాలతో కూడిన నుడికారాలు గలభాష
మధురమైన భాష నా మాతృభాష

అష్టావధానం”, “శతావధానం”  
“సహస్రావధానం” “సమస్యాపూరణం
నా తెలుగు భాషకే మణిహారాలైన
అరుదైన భాష నా... తెలుగుభాష...

స్పష్టత, శ్రావ్యత మాధుర్యం, గాంభీర్యం
మాండలీకాలతో మధురిమలొలకించు
మధురమైనటువంటి మాతృభాష
అమ్మపలుకుల భాష నా తెలుగుభాష..

ప్రాచ్య ఇటలీ పేర ప్రభవించు నా భాష
పలుకు పలుకు లోన తేనెలొలుకు భాష
అన్ని స్వరాలకు అనువైన భాషిది
మధుర మైన భాష నా తెలుగుభాష

తెలుగుబాషలోని తేటతెల్లపదము
వ్యాకరణముతోటి వాసికెక్కి
పద్యసంపదున్న పదునైన బాషరా
తేనెపలకుల భాష నా.. తెలుగుభాష

మరువకండి మీరు మాతృభాషనెపుడు
భావివార్కితెలుపు భాద్యతెరిగి
మధురమైనభాష మన తల్లిభాష
తేటతెనుగుభాష నా... తెలుగుభాష

ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
చరవాణి సంఖ్య : 9700007653
**********************

*ఎంత కమ్మదనమో*

                         *రచయిత*... *అవనిశ్రీ*

తెలుగంటే
ఎంతకమ్మగుంటది
ఉడుకుడుకు బువ్వ ఊదుకోని తినట్లుంటది
ఉరుకురికి వరిమునం ఎల్లినట్లుంటది
ఊ కొడుతూ కథ వినట్లుంటది
జో..కొడుతూ నిద్రపుచ్చినట్లుంటది
మనదైన యాస మాట్లాడితే
అమ్మ బువ్వముద్దగల్పి నోట్లబెట్టినట్లుంటది

తెలుగంటే
ఎంత కమ్మగుంటది
నాగలి దున్ని తుమ్మకొమ్మనీడన సద్దితిన్నట్లుంటది
ఆకలైనప్పుడు సంకటిలో సింతొక్కు తిన్నట్లుంటది
అమ్మ కూలీకెల్లి కొంగు సెరుగున తెచ్చిన జొన్నపిస్కిల్లను తిన్నట్లుంటది.

తెలుగంటే
ఎంతకమ్మగుంటది
ఎరువుబండ్లెన్క పోతుంటే ఎన్నెల పాటిన్నట్లుంటది
సెరువులా శాపలు పడుతుంటే వలెసెటప్పుడు పలికే హైలేసో హైలేసో అనే సంతోషంగుంటది.

తెలుగంటే
ఎంతకమ్మగుంటది
సాకలోళ్ళు బండలమీద ఉస్ ఉస్ అని పలికే పలుకులక్కుంటది
వడ్లోళ్ళు గూటమెత్తినప్పుడు సమ్మెడెత్తినప్పుడో
పెద్దబాడిశెత్తి తుమ్మమొద్దుసెక్కుతున్నప్పుడు కూడ
గుంటది.
తెలుగంటే జుంటితేనేనే
తెలుగంటే ఇంటిభాషనే
తెలుగంటే పంటివరుసనే
తెలుగంటే సంటిపిలుపే.

*******************

🙏🌷🙏


*అంబటి భానుప్రకాశ్.*
  దుప్పల్లి.
  వనపర్తి జిల్లా.
 9948948787.
🍁🌸🍁🌸🍁🌸🍁🌸


🌷 *తెలుగు మాధుర్యం.*🌷

*సీ.*
దేదీప్యమానమై దివినివెల్గొందు నా
భాను తేజమునాపి పట్టగలరె,
అమృతంపు జాడయై,అందమౌ కిరణాల
అందించు చంద్రుని ఆపగలరె,
సౌగంధ భరితమై,జగమెల్ల  ప్రసరిల్లు,
పరిమళాలనుమీరు పట్టగలరె,
మాతృమూర్తియెజూపు మమతాను రాగాల
అడ్డుకోదలచిన నాపగలరె,

తే.గీ.
సూర్య కిరణాల వెల్గులె చూడ!తెలుగు,
చంద్ర వదనాన్ని మించిన చల్ల!తెలుగు
అమ్మ ప్రేమను మురిపించు అమృతధార!
తెలుగు వెల్గుచు నుండును, తేటముగను.!!

ఆ.వె.
తేనె పంచదార తీయని రుచులను,
కలిపి నారగించి పలికి నట్లు,
తెలుగుభాష పలుకు తెలుపగా వశమౌనె,
పలుకులాడ వలయు తెలుగుభాష.

ఆ.వె.
నేర్వవచ్చు చాల నేర్పుగా ధరలోన,
యితర భాషలన్నొ యిష్టముగను,
మాతృభాష మరుపు మనిషికి చేటౌను?
మరువకుండ పలుకు మనసుదీర.

కం.
అందము తెల్గునకనరే,
గంధము తెల్గున కనుచును ఘనముగ నిడరే,
కందము మాకందమనుచు,
వందన మందును తెలుగున వరసగ నేడున్,.

కం.
మనభాషను భాషించుము,
జనభాషగ పోషణంబు సల్పుము నెపుడున్,
తెనుగును ఘనముగ నిల్పగ,
ననవలె,వినవలె, మనవలె అనితరముగనే,

కం.
కొదువే మున్నది జూడగ,
యెదురే మున్నది మనకిన యెచ్చోటైనన్,
కదరా సోదర ,నేడిదె,
మదిలో  తెలగాణ భాష మరువకు మెపుడున్,

కం.
సోమన పోతన బుట్టిన,
భీమన ,కాళన సినారె,బీజము లిటనే,
నీమది లోదాశరధిని
వాదము సేయక బెదరక వందన మనరే,

కం.
రాయలు,కాకతి రాజుల
రాయగ కవనము నిలిచెను రమ్యంబుగనే,
పాయని చరితే తెలుగని,
రాయుము సౌవర్ణ యుగమె రాగలదనుచున్.


🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
*************************

 శీర్షిక : *తెలుగు వెలుగు* 


పరాయి భాషలన్ని నేలపై తారలైతే 
ఆ తారలకే వెన్నెలనిచ్చే నేల చంద్రుడే తెలుగు 

పరాయి భాషలన్ని  ప్రవాహించే నదులైతే 
ఆ నదులన్నింటికి పవిత్రతనిచ్చే గంగతీర్థమే తెలుగు 

పరాయి భాషలన్ని  గొప్పగా కనిపించే చెట్లు అయితే 
ఆ చెట్లన్నిటికి ప్రాణం పోస్తూ తన ఘనతను త్యాగం చేసే వేరు రూపమే తెలుగు 

పరాయి భాషలన్ని  మాటలైతే 
ఆ మాటలకే మమకారం పంచే మాధూర్య స్వభావం తెలుగు 

పరాయి భాషలన్ని  పోటాపోటి తత్వాలైతే 
ఆ పోటికే దీటుగా నిలిచిన ద్రవిడ భాష తెలుగు 
                *అభిరామ్*
‬*********************

*✍తెలం(గు)గాణ భాషా వైభవం🖌*లే
లేదా
   తెలుగు భాషా గొప్పతనం

ప్రాచీనమైనది నా తెలుంగు భాషా
ఆంధ్రపాలకులతో ఆంధ్రభాషగా నాడు
తెలంగాణతో తెలుంగు భాష గా మారెను నేడు

అచ్చమైన పూర్ణానుస్వరమైన భాష
వినసొంపయిన యాస భాష
ఇంపు సొంపయిన గ్రాంథిక భాష
చారిత్రక జానపద పలుకుబడుల భాష నా తెనుగు భాష

ప్రత్యక రాష్ట్రము తో మురిసిపోతుంది
నిర్మలమై పరిమళమై మెలుగుతుంది
ప్రపంచ తెలుగు మహాసభలను తిలకిస్తుంది
కమ్మనైన తీయనైన ఆత్మీయభావాలను 
తమ కలంతో కదిలించిన తెనుగు కవులెందరో
అందరికి వందనాలు... వందనాలు

నా తెలంగాణ సంప్రదాయ రచయిత
నా తెలంగాణ ఆదికవి పాల్కురికి
మధురభక్తి సహజకవి పోతన
తెలంగాణ తొలి పొద్దు మన కాళోజి
నా తెలంగాణ కోటి రతనాలవీణ
అని చాటిన నా దాశరథి
తొలి తెలుగు రామాయణ రచయిత గోన బుద్ధారెడ్డి
హేతువాద రచయిత నా సుద్దాల హనుమంతు
దాశరథి శతక కర్త కంచర్ల గోపన్న
గోలకొండ సంచిక సాహితీ వేత్త సురవరం
జ్ఞానపీఠ గ్రహీత సాహిత్య ప్రభుత నా సినారె
ప్రాసాత్మక పదాలతో మాతృ భాష వెలుగులు
చిందిస్తున్నాయి నేడు ప్రపంచానికి వెలుగులు

అమ్మ లాంటి అలవాటైన భాష
ఆంగ్ల భాష తో కాకూడదు మృత భాష

మాతృ మూర్తిని గౌరవిద్దాం
మాతృ భాషను కాపాడుకుందాం

తెలంగాణ సాహిత్యం లో 
సాహితీ మకుటాలెందరో

అందరికి వందనాలు... వందనాలు


                      ఇట్లు
             నా సొంత రచన
  ✍ తెలుగు తిరుమలేష్
    తెలుగు ఉపాధ్యాయులు
ఎం. వి.రామన్ ఉన్నత పాఠశాల
ప్రొ. జయశంకర్ స్వచ్చంధ సేవా  సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు
      సెల్ : 9908910398
********************

నా తెలుగు

తేనేకన్నా తీయని అమృత భాష నాది
ఆంధ్రులకు  ఉత్తేజాన్నిచ్చే ప్రకృతి పర ప్రాచీన తెలుగుభాష నాది
తెలుగు పదం పలికితే
ఆధరం...మధురం
తెలుగు పాట పాడితే
వదన వికసితం!

తెలుగు అక్షరాలెప్పుడు
వెలుగుల్ని వెదజల్లు!
తెలుగు భాష నిత్యం
అవనిలో విరాజిల్లు!!
చేయెత్తి జై కొట్టు తెలుగు
గతమెంత ఘనకీర్తి గల
తెలుగు నాది..
నా శ్వాస-నా అణువణువు తెలుగే!!

చిమ్మచీకటి పారద్రోలే
వెలుగు నా తెలుగు
కవుల అక్షర పాత్ర
నా తెలుగు...
నా నేల... నా నిశ్వాస తెలుగు!!
కాబట్టి!!!

మనమంతా మమేకమై
మన తెలుగు తరిగిపోకుండా...
వెలుగు ఆరిపోకుండా
ప్రదీప్తం చేద్దాం
తెలుగును బ్రతికిమ్చడానికి....
అవసరమైతే..
చావనైనా చద్దాం

తెలుగు అక్షరాలు
ఆయుధాలుగా
తెలుగు వెలుగుల దివిటీ
వెలిగిద్దాం
తెలుగు వికాశానికీ శ్రమిద్దాం!
తేనె సోన మన తెలుగు అని నిరూపిద్దాం!!


          ...ఈవేమన
సెల్;7893451307
********************

🌺🌸🌺
 మధురం-మాతెలుగు భాష

తేనేకన్న  తీయనిది తెలుగు భాష 
ఇంపైన  మాధుర్యం నాతేటతెలుగు
 మాతెలుగు నుడికారం  
మాకెంతో  మమకారం          
సప్తవర్ణాలతో సుస్వరాలు 
పలికించె  తెలుగు       
సెలయేటి  అలలలా   
వినసొంపు  యాస         
రజాకార్ల దగాకోర్లపీచమణచే 
దాశరథి కాళోజిల  చేవ్రాలు       
తెలుగు వెలుగులు శ్రీకారమయే   
కవికిషోరాలకు ఉత్తేజకరమాయే                
నిత్య నూతనమై   వెలుగొందు  
తెలుగు   భాష              
అందుకోవాలి   ఇక భావితరం,
నవతరమై,
వెలగాలి నిరంతరం
ఎ.భాగ్యచంద్రిక.
తేది:-05.01.2018.
****************

 🌻🙏🌻
తెలుగు వెలుగు

కందనికే అందము నాతెలుగు
కవులకవితల పూలసాగు నాతెలుగు
కమనియ అక్షరాల కూర్పు నాతెలుగు
మాఅమ్మ  కంఠధ్వని నాతెలుగు
తేటగీతి తేనె పలుకు నాతెలుగు
తేనెపట్టు కూర్పు వర్ణ అక్షరమాల
అక్షరాలను పదాలుగాపేర్చగా
పదాలను అర్థవంతమైనపదహరాలుగాకూర్చగా
సమర్పించుకున్నారు తెలుగుభాష తల్లికి
సుస్వరాలసుమదురకవితాఅక్షరమాలతి
ఆటవెలది అందం నా తెలుగు
ఆదికవి నన్నయ్య పలుకులు నాతెలుగు
అజంతపదవీనలతీగసాగునాతెలుగు
చదువులమ్మపూలవడినాతెలుగు
అమ్మ భాష తెలుగు గా
అక్షరమై వెలుగు గా
మత్తకోకిల మనసారా పాడిన పద్యంనాతెలుగు
కోకిలమ్మ కూతసాగునాతెలుగు
జీవితాన తీరర్భలేని తల్లి ఋ ణంతెలుగు
ఉత్పలమాల తోనా తెలుగుతల్లికి పూలపద్యాలమాల
చంపకమాతోనాతెలుగు తల్లికిచందన పద్యాల మాల
              రచన
   ఉప్పరి తిరుమలేష్MA.BEd
 తెలుగు ఉపాధ్యాయుడు
జీనియస్ హై స్కూల్ వనపర్తి
చరవాణి9618961384
********************

ఎప్పుడూ వెలగాలి
-+-+------+++-+++
అమ్మ నోట లాలి పాట
కమ్మదనాల తెలుగు బాట
అన్నమయ్య జో అచ్యుతానంద
తెలుగింటి బుజ్జాయికి తొలి తేనెల మూట
ఉగ్గుపాలతో ఉయ్యాల జోల
రంగరించి అద్దిన రాత
పెదవులు పలికే అత్త, అమ్మ వూసులే
అచ్చ తెలుగు మొదటి బాసలు
తప్పటడుగుల ముచ్చట్లు
చేతికందని చందమామ
దాగుడు మూతల పరుగులు
పాల బువ్వ సువాసనలు
తెలుగు మధురిమల జావళి
అ, ఆలు అమరిన పలక
ఓనమాలు దిద్దిన బలపం
నిగ్గరించిన అద్భుత తెలుగు పాఠం
చిట్టీ చిలకమ్మ గెంతులు
ఉట్టి కట్టి కృష్ణయ్య ఆటలు
వరాల తెలుగుకు వెండి వన్నెలు
తరతరాల భాషా ఝరులు
నిరంతరం సాగే నదీమ తల్లి
ఇది ఆగదు.. ఇది అనంతం
ఇది అమృతం..అఖండం
నిత్యనూతనం  సత్య సాగరం
ఇలా సాగని..ఎప్పుడూ వెలగని..

-పట్నాయకుని వెంకటేశ్వరరావు
9705347880
***************

శీర్షిక : మాతృభాష    
  
ప:అమ్మ నోటి కమ్మదనం అద్దుకున్న భాష 
అమ్మ పాల తియ్యదనం నింపుకున్న భాష 
నాలో చైతన్యానికి నాందియైన భాష  
ఆ భాషే నా శ్వాస  అదే మాతృభాష

1.చిన్నా కన్నా నాన్నను మాటల మమకారం
చిన్ని చిట్టి తల్లీ యను పలుకుల అనురాగం
లాలి జోల పాటలయ్యి తూలి తేలియాడించి
ముద్దూ మురిపాలల్లొ ముంచెత్తిన భాష  
అదే అదే నా భాష అదే మాతృభాష 
అదే యాస అదే శ్వాస అదే తెలుగు భాష

2.ఆనందం కలిగిందా అ ఆ అన్నాను 
ఇబ్బందులు అనిపిస్తే ఇ ఈ అన్నాను 
ఊయల్లో పాటలు విని ఉ ఊ అన్నాను 
ఎవరూ కనబడకపోతె ఎ ఏ అన్నాను 
ఓపలేక ఓర్చుకోక ఒ ఓ అన్నాను
ఏడ్చి ఏడ్చి ఎక్కిల్లలో ఐ ఔ అన్నాను 
ఇదే ఇదే నా భాష  ఇదే తెలుగు భాష 
ఇదే యాస ఇదే శ్వాస  ఇదే నా మాతృభాష

3.భాష లెన్ని నేర్చిన నా బాధను వివరించేది
వేషమేది వేసిన నా ధ్యాస లోన మెదిలేది
దేశమేది ఏగిన నా దేహమంటీ నడిచేది 
ప్రాణముండు వరకు నోట ప్రవాహమై వచ్చేది  
అదే అదే  నా భాష  అదే  తెలుగు. భాష 
అదే యాస అదే  శ్వాస అదే  మాతృభాష

రచన-మధుసూదన్ కోమటి,
                 ఎస్ ఏ (తెలుగు),
ప్రభుత్వ ఉన్నత పాఠశాల (డైట్) నల్లగొండ.
**********************************


అక్షర మహిమా అల్లిక
కవి హృదయ అంతరంగిక
మదిని దోచే ప్రణయగీతిక
అదే అదే మన తెలుగు కవిత
మమతల మధుర మల్లిక
సాహిత్యాల డోలిక
ఆనంద మకరంద తారక
అదే అదే మన తెలుగు కవిత
ప్రకృతిలోని అరుదైన పుష్పిక
చిరుగాలుల శబ్ధవీచిక
మైమరపించే స్నేహ కానుక
అదే అదే మన తెలుగు కవిత
భావానురాగ అద్భుత మాలిక
గగనపు జాబిలి దివ్య జ్యోతిక
మాటలు నేర్చిన పంచవన్నెల రామచిలుక
అదే అదే మన తెలుగు కవిత
           .....✍సత్యనీలిమ....
******************


నేను నా తెలుగు

చిన్నప్పుడు అన్నం తింటూ అ, ఆ లు
అడుగులు వేసుకుంటూ పదాలు
ఆటలు ఆడుకుంటూ పద్యాలు
వయసొచ్చాక నీ ఛందస్సు సోయగాలు
పెద్ద చదువులు చదువుకుంటూ మరచిపోతానేమో
అని భయంతో నీ నవలలు , కథలు , కథానికలు

     ఇప్పటికి నాలో నన్ను చూసుకోవడానికి నువ్వే కావాలి
     నా ప్రేయసి ని మురిపించడానికి నువ్వే కావాలి
     నిన్ను చదువుతూ మళ్లీ నిన్ను పొగడటానికి నువ్వే
     నిన్నెంత ఆరాధించి, ఆస్వాదించి  చెప్పాడో ఆ పెద్దన
     "కల ఏదేని జన్మంబు కలుగు గాక మధుర మధుర రసంబైన తెనుగు నా మాతృ బాష"
     నాకు అలాగే ఉంటుంది నిన్ను చూస్తూ ఉన్నప్పుడు

తేనెటీగలు చూడలేదు కానీ నీ తేట గీతి నాకిష్టం
ఉట్టి మీద కూడు కన్నా ఉత్పలమాల నాకిష్టం
శిశిర రుతువు తో పాటు శార్దూలం నాకిష్టం
నా చెలి చెక్కిలి ని పోల్చే చంపకమాల నాకిష్టం
వేసవిలో మత్తెకించే మల్లె పూల కన్నా మత్తేభం నాకిష్టం

రచన 
ఉక్కుశిల జయకృష్ణ +91-9035406434
******************************

కుసుమంచి శ్రీదేవి
శీర్షిక-తెలుగు వైభవం
-------------------
తెలుగు ముంగిట
జన్మించి...
తెలుగు తల్లి ఒడిలో
సేదతీరి..
అచ్చులు..హల్లులు
దిత్వాలు..సంయుక్తాలు..సంశ్లేషాలని
ఆభరణలుగా ధరించి,
సంధులు..సమాసాలు..అలంకారాలతో
ఎంతో ప్రకాశవంతమైన వర్ఛస్సు కలిగిన
తెలుగు తల్లి దీవెనలతో..
మన తెలుగింట పురుడుపోసుకొన్న
 మంచి విలువలతో కూడిన
సంస్కృతి,సాంప్రదాయాలతో పాటు..
బ్రతుకు తెరువు కోసం
ప్రపంచ విజ్ఞానం నేర్చి....

రెక్కలు బలపడ్డాయనే భ్రమలో
చల్లని దీవెనలిచ్చే..
విలువలు నేర్పే ఆ తల్లిని మరిచి..

పరాయి భాషా వైపు పరుగులుతీసి,
మన సంస్కృతి,సాంప్రదాయాలను
తూర్పూర బెట్టి...ఎండమావులను
చేస్తున్నారు...నేటి తరం

సృష్టిలో ఎన్నిప్రేమలు లభించిన...
అమ్మ ప్రేమలో మాధుర్యాన్నివ్వలేవు...

బ్రతుకు తెరువు కోసం
ఎన్ని భాషలు నేర్చిన...
మాతృభాష తియ్యదనం
ఇసుమంతైన పరాయిభాషలో లభించదు...
***********************


************
తెలుగు భాష 
************
- పల్లోలి శేఖర్ బాబు 9490484316. 

నా భాష !  తెలుగు భాష !
అవనిలోనే మధుర భాష ! !
అందమైన తెలుగు భాష !
అమ్మ పాలతో నేర్చు భాష ! !

కవిత్రయం కలాల్లో . .
మహాభారతం తెలుగుభాష !
అన్నమయ్య పద కవితల్లో . . 
లాలిత్యం తెలుగుభాష ! !

అజంతా శిల్పాల్లో . .  
రమణీయం తెలుగు భాష ! 
గోదావరి ఉరుకుల్లో . .
లావణ్యం తెలుగు భాష ! !

కృష్ణ దేవరాయల మదిలో . .
ఆముక్తమాల్యద తెలుగు భాష !
భువనవిజయం గోష్ఠుల్లో. .
పరిఢవిల్లిన తెలుగు భాష ! !

నవజవ్వని కులుకుల్లో . .
హొయలోలికే తెలుగు భాష !
నవ వధువు బుగ్గల్లో . .
సిగ్గులోలుకు తెలుగు భాష ! !

కోకిలన్న పాటల్లో. .  
కమ్మదనం తెలుగు భాష ! 
నెమలి బావ ఆటల్లో. .  
సమ్మోహనం తెలుగు భాష ! !

అమ్మ జోల పాటల్లో . .
సమ్మిళితం తెలుగు భాష !
బామ్మ పిట్ట కధల్లో. .
బతుకు జ్ఞానం తెలుగు భాష ! !

అరవిరసిన పువ్వుల్లో . .
మకరందం తెలుగు భాష !
పసిపాప నవ్వుల్లో . .
స్వచ్ఛదనం తెలుగు భాష ! ! 

పల్లె పడుచుల పైటల్లో  . .
మంత్రదండం  తెలుగు భాష !
పల్లె వాసుల పలుకుల్లో . .
ప్రేమతత్వం  తెలుగు భాష ! ! 

పైరగాలి తరగల్లో . .
పారవశ్యం తెలుగు భాష ! 
కడలి అలల నురగల్లో . .
తెల్లదనం తెలుగు భాష ! !

వివరణ : 
*కోకిలన్న*

పాట పాడేది మగ కోకిల. 
(ఆడ కోకిల పాడదు) 

కావున "కోకిలన్న" అన్నాను 

*నెమలి బావ* 

నాట్యం చేసేది మగ నెమలి. 
(ఆడ నెమలి ఆడదు ) 

కావున "నెమలి బావ"అన్నాను . 

- పల్లోలి శేఖర్ బాబు,  9490484316.
****************************

 నా తెలుగు భాష
     🌷🌷🌷🌷🌷🌷
కోకిలమ్మ పాట నాతెలుగుభాష
జాబిలమ్మ చల్లదనం నా తెలుగు భాష
మనసుదోచే మరాళం నా తెలుగు భాష
స్వచ్ఛమానస సరోవరం నా తెలుగు భాష
స్వేచ్ఛావిహాంగం నా తెలుగు భాష
మధుర పానకము నా తెలుగుభాష
నిత్య పాలవెల్లి నా తెలుగు భాష
మందార మకరందం నా తెలుగు భాష
పారే సెలయేరు సవ్వడి నా తెలుగుభాష
నటరాజ నాట్యమయూరి నా తెలుగు భాష
విశ్వవ్యాప్త విహారి నా తెలుగు భాష.  !!!

రచన: పూదత్తు భాస్కర్
          జోగులాంబ గద్వాల 

☘☘☘☘☘☘☘☘
 పాలకుర్తి నాగజ్యోతి
07/01/18

నా తెలుగుభాష...


నా తెలుగు భాష
అమ్మపాలభాష
చిలుకపలుకుల భాష
చిరునగవులనలంకరించు భాష

కమ్మనైన భాష
కఠినాత్ముల గుండెను కరిగించు భాష
మాటలోన, పాటలోన
అమృతాన్ని ఒలికించు భాష

మధురమైన మమతను పెంచుభాష
అరె మనతెలుగోడే అంటూ దేశ సరిహద్దవతల 
బంధమును పెంచుభాష
స్నేహదారులను కలిపే భాష

అజంతా భాష
మేటి కవులు మెచ్చుకున్న భాష
రాయలకాలాన్ని ఏలినభాష
రత్నమై మెరుపులీనుతున్న భాష
తెలుగు మహా సభలలో మెరిసిన భాష నా తెలుగు భాష...

@సిరిమల్లెలు...
***************

🔅🔅🔅🔅🔅🔅🔅🔅
           తెలుగు భాష
🔅🔅🔅🔅🔅🔅🔅🔅

1)
శ్రీ పదప్రభాస, చెలువారు మనబాస,
రమ్యమైన అక్షరాల భాష
తెలుగు నాల్క పల్క తీపినొల్కెడిభాష
లలితవాగ్విలాస తెలుగుభాష.                

2)
తెలుగుభాష ఘనత దెలుపగా వశమౌనె
నలువకైన వాని చెలువకైన
తెలిసినంత కొంత తేటతెల్లముసేతు
తియ్యతేనె లొలుకు ‌ తెలుగుభాష.                

3)
తెలుగుభాష గొప్ప దెలుప శక్యంబౌనె?
భవునకైన పద్మభవునకైన!
ఎరిగినంత కొంత ఎరిగింతు,ఖ నా వంతు
పలుకు కొలువు సేయ తెలుగుభాష.                

4)
పలుకులెన్నొనేర్వ ఫలితమ్మదేమొకో!
తలపు దెలుపునదియె పలుకు కనుక
తెలుగుకన్న  తలపు దెలుపు మాటేదొకో!
తెలుగునాట పలుకు తెలుగుభాష.                  

5)
తెలుగువారి భావములు గళాన వెడలె
ధ్వనులుగాగ నదియె తెనుగుబాస
దాని నక్షరమ్ముగానిల్ప లేఖన 🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆
                                    తెలుగుభాష
🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆
                           దేశభాషలందు తేజరిల్లెడు భాష
                           అందచందముల "అజంతభాష"
                           పలుకులందు తేనెలొలుకుచుండెడి భాష
                           పలుక వలయుగాదె తెలుగుభాష.                    6

                          పదము పదము చూడ ముదమైన నడకయే
                          పలుకు పలుకునందు నొలుకు తేనె
                          అక్షరమ్ములన్ని అందచందాతో
                         ‌ నలరుగాదె నాదు తెలుగుభాష.                          7

                         బాసలోనితీపి, ప్రాంతీయమగు పల్కు
                         ‌యాసలోనిసొంపు,అక్షరాల
                          అందమైనరూపు డెందమ్మునలరించు
                         పలుకవలయు మనము తెలుగుభాష.                      8

                         రమ్యమైన అక్షరాలపంక్తులు  చూప-
                         రులకు కనులవిందు కలుగజేయు,
                         తేనెలొలుకు పలుకువీనులకునువిందు
                         కలుగజేయుగాదె!తెలుగుభాష.                                  9

                         భావ సుప్రకటన గావింపగా తెల్గు
     ‌ ‌‌‌          ‌         భాసకన్న మిన్న బాసలేదు
                         అన్యభాషమాటలాడనేలకొ!పల్కు
                        తెలుగువారితోడ తెలుగుభాష.                                   10
🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆
                                         తెలుగుభాష
🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆
                             భారతోర్వినున్న బాసలందెన్నగా
                         ‌ ‌‌‌   తెలుగుబాసకున్న ఘన గుణాల
                             నెరుక గలిగి చూడ నేభాషకునులేవు
                             లలితపదవిభాస తెలుగుభాష.            16

                            అరవబాసనెన్న అమృతాన్నమదికదా!
                            కన్నడమ్మునెన్న కస్తురి కద!
                            తెనుగుబాసనెన్న తియ్యతేనియకదా!      
                        ‌‌    పలుకవవయుమనము తెలుగుబాస.     17

                            అరవ కన్నడమ్ము లరయ ప్రాచీనత
                            గలిగియున్నె తెలుగుకన్న,కాని -
                            తియ్యదనమునెన్న తెలుగు పలుకుమిన్న
                            లలితవాగ్విలాస తెలుగుభాష.                  18

              ‌              గానమునకు ననువుగానుండి పొలుపారు
                            చెవులకింపునింపి చెలువు మీరు,
                            ఇద్ది ప్రాచ్యఖండ పిటలిభాషయె యంచు
                            పలికినాడు  హెన్రి  తెలుగుభాష.              19
తెలుగువర్ణమాల తెలిముత్యములహేల
తెలుగు పలుకు తియ్య తేనె లొలుకుతి
య్యదనముగలుగు తెలుగు మాటాడుమా
లలితమృదువిలాస తెలుగుభాష.               20
✍✍✍✍
వైద్యం వేంకటేశ్వరాచార్యలు
99896796
🔆🔆🔆🔆🔆🔆🔆🔆
తెలుఁగు భాషా ప్రథమ స్వతంత్ర కవి - పాల్కుఱికి సోమనాథ మహాకవి!
రచన: మధురకవి గుండు మధుసూదన్
.
కందములు:
ఘన కాకతీయ కాల
మ్మునఁ దిరమగు నోరుఁగంటి పురిఁ బాల్కుఱికిన్
జననమ్ము నంది తా వెలిఁ
గెను సోమన సకల శాస్త్ర గీ రధికృతుఁడై!
.
వారని శివ భక్తియు దై
వాఱంగను శైవదీక్షఁ బఱఁగం గొనియున్
వీరమహేశ్వర వ్రతుఁడై
ధీరత వినుతించె నభవుఁ దిరముగఁ దానున్!
.
తెలుఁగుం గన్నడ సంస్కృత
ముల నధికారమునఁ గావ్యములను రచింపన్
బులకించె జనుల హృదులునుఁ
దులకించెను సోమనాథుఁడును లోకమునన్!
.
శివకవి యుగమ్ము నందునఁ
గవి పాల్కుఱికియె ముదమునఁ గావ్య రచనమున్
బ్రవిమల కాంతులఁ జిమ్మఁగ
సువిదితముగఁ జేసెఁ గవులు చోద్యము నందన్!
.
కమనీయ వీర శైవయు
తము బసవపురాణ పండితారాధ్యచరి 
త్రముల విరచించి జనులకు
నమల ద్విపదాఖ్య పద్యహారముల నిడెన్!
.
అనుభవసారము నెల్లను
ననుభవసార మను పేర నతుల సుకావ్య
మ్మును రచియించియుఁ బ్రజ కిడి
తన జన్మ వెలుంగు లీనఁ దనియించె ధరన్!
.
పలుకావ్యాల్ విరచించియుఁ
దెలుఁగుల కందించి జనుల తిరమగు పలుకుల్
విలువైన రీతిఁ బ్రసరణ
ముల వెలయించియు వెలింగె ముదమునఁ దానున్!
.
శివభక్తుల కథ లెల్ల న
భవు కృపచేఁ దాను నెఱుక పఱచి జనులకున్
శివ మహిమలఁ జూపించెను
నవనీత మనోజ్ఞ హృద్జ్ఞ నవ్యపథమునన్!
.
శ్రీ వీరశైవ భూసుర
కైవార ప్రకట నిగమ గమ్యవిదుండై
యా వీరశైవ ఘనుఁడే
దైవారాధననుఁ గృతులఁ దరియింప నిడెన్!
.
ఆ మహనీయుని కెనయగు
నే మహనీయుఁడును లేఁడు నిక్కముగ భువిన్
సామాన్యుఁడు కాఁ డాతం
డా మాన్యున కంజలింతు ననిశము నేనున్! 
.
స్వస్తి
.
🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆

 అరవిందరాయుడు దేవినేని

///తెలుగమ్మా///

అమ్మ స్థానంలో
ఏ విశ్వసుందరి వర్ణచిత్రమో తగిలించి
పూజించే వారుంటే ఉండొచ్చుగాక

అమ్మా ! తెలుగమ్మా!

నేను మాత్రం
నాలుకను ఊయలగా చేసి నీ పదాలను
నా తలను పల్లకీ చేసి నీ పాదాలను
ప్రతిష్ఠించి
దిక్కుదిక్కునా ఊరేగుతాను

అమ్మా!తెలుగమ్మా!

నిన్ను ఆర్నెళ్ళకో ఏడాదికో
యాదిచేసుకోవడం మాట అటుంచు
అసలు నిన్ను నేను మరిచిపోయిందే లేదన్నది
నీకు తెలియదా?

అమ్మా! తెలుగమ్మా!
ఒక్కcutting అనే ఆంగ్లపదం
కోయు తెంచు కత్తిరించు నరుకు
తురుము ఉత్తరించు వంటి సొంపైన పదాలను
గడకొయ్య సీమచింతకాయలను రాల్చినట్టు రాల్చి
శూన్యంలోకి విసరేస్తుంటే
ఆర్తిగా ఒడిసిపట్టి
నా తెలుగు గుండెల్లో
 భక్తిగా నాటేసుకున్నసంగతి
నీకూ నాకూ మాత్రమే తెలుసుకదమ్మా

అమ్మా! తెలుగమ్మా !
నాలుగాంగ్ల పదాలమధ్య
ఒక్కతెలుగుపదాన్ని శిలువేసి
తెలుగాంగ్లికులు చేసే గుండెగాయాల్ని
అలనాటి  చిత్రాల కొలనుల్లో మునిగి
విసుగు నలత కలత నడత ఇంపు
సొంపు తేలిక కులాసా భరోసా వంటి
అపురూపమైన ఔషధప్రాయమైన హృద్యమైన
సుందరపదావళుల్లో
నా శుష్కకర్ణపుటాలను పొరలించి
స్థిమితపడ్డ సంగతి
నీకూ నాకే తెలుసమ్మా!

అమ్మా! తెలుగమ్మా!

నీపాదాలసాక్షిగా చేసే ప్రమాణమిదే
జీవితం పొద్దువాలేదాక
తనువుకట్టె కాలేదాక
నిలువెల్లా 
నేనో సింహాసనాన్నై
ప్రపంచభాషాసామ్రాజ్ఞిగా
నీకు పట్టంగడుతా

& & &
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



Comments

  1. తీయనైన భాష
    మన తెలుగుభాష
    తల్లిలాంటి భాష
    మన తెలుగుభాష

    పాలబువ్వకన్న  కొసరి
    రుచులు పంచు భాష
    మకరందముకన్న 
    బహు మధురమైనభాష



    వీణతీగ పలికినట్లు
    వినడానికి ఇంపుగొలుపు
    కోయిలమ్మ పాటలాగ
    పాడుతుంటే హాయి గలుగు

    తెలుగు పదము పలికినపుడు
    తనువు పులకరించు
    సంగీతము  పొంగిపొరలి
    మేని పరవశించు



    కవిత్రయం మురిపెముగా
    పెంచినది ఈ భాష
    కవులెందరో ప్రేమతో
    పంచినది ఈ భాష

    దేశభాషలెన్నియున్న
    మేటిభాష మన భాష
    పరదేశీయులెందరో
    ప్రేమించిన తెలుగుభాష



    ముత్యమంటి అక్షరాల
    మాలలు కలిగిన భాష
    పద్యగద్య రత్నాలతో
    పొదగబడినదీ భాష

    అవధానమనే హారంతో
    వెలుగులీను తెలుగుభాష
    అజరామరమీ భాష
    అందమైన జీవభాష


            ౼౼౼౼౼౼౼$$$$$౼౼౼౼౼౼౼౼
                 వెంకట కృష్ణారెడ్డి మల్లు
    నెల్లూరు

    ReplyDelete
  2. Super Super super super super super

    ReplyDelete

Post a Comment