ఆదర్శ విప్లవనారి సావిత్రిబాయి పూలేకు అక్షర నీరాజనం


ఆదర్శ విప్లవ నారి
సావిత్రి బాయీ పూలే
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.

ధీరశాలివమ్మ సాయిత్రిబాయీ
అతివలకు నీవు అక్షరాలను నేర్పి
జ్ఙానజ్యోతులెన్నో వెలిగిస్తివమ్మా
నయగావ్ గ్రామంలో జన్మించినావు
జ్యోతిరావుతోటి జతకట్టినావు
బాధిత పిల్లలకై స్థాపించానవమ్మా
బాల హత్య ప్రతిబంధక్ గృహాన్ని
సత్య శోధక్ సమాజ్ నిర్వహణలోనూ.
రైతాంగ, కార్మికుల పోరాటంలో
నీవు చూపిన తెగువ మరువలేము
విద్యావ్యాప్తే ఒక గొప్ప ఉద్యమమని మూఢవిశ్వాసాలు తొలగించాలని, మనిషిని స్వేచ్ఛగా ఆలోచింపజేయాలని
శాంతియుత ఉద్యమాలే చేపట్టినావు.
నీ పోరాటం గెలిచింది
నీ ఆశయం ఫలించింది
మహిళంత నేడు... రాణిస్తుఉన్నారు
నీవు కన్న కళను సాకారం చేస్తున్నారు
ఓ సామాజిక విప్లవ కారిణీ..‌
ఓ ఆదర్శ విప్లవనారీ.‌‌..
అందుకో.. అందుకో.. ఇవే మా
లక్షల అక్షర నీరాజనాలు..
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
9700007653
************

చదువుల తల్లి

విద్యాజ్యోతివై
భారతదేశ
తొలిమహిళా
ఉపాధ్యాయ ఖ్యాతివై
సమాజంలో
మహిళా విద్యా స్ఫూర్తివై
అహర్నిశలు అక్షర కుసుమాలు పూయిస్తూ...
సమాజాబివృద్ధికి
తొలిమెట్టువై...
ఆడదంటే...అబల కాదు
విద్యాసిరి అని నిరూపిస్తూ....
అక్షరవిలువలు అందరికి
అందించే అక్షర జ్యోతివై..
ఆదర్శ మహిళా
ఉపాధ్యాయ శిరోమణివై
స్వాతంత్రపోరాటంలో
మహిళా నిరక్షరాసుల్నిఏరి వారికి
అక్షరజ్యోతుల్లా తీర్చిదిద్దిన నీ మేటి!
విద్యలో నీకు నీవే సాటి!!
ఉత్తమ భోధకురాలుగా
విద్యాసేవల్ని అందించిన
సావిత్రి జ్యోతీరావ్ పూలే అందుకో నా అక్షర నివాళి!!!


                ....ఈవేమన
***********************

*సావిత్రి పూలే*
రచన.... *అవనిశ్రీ*

అక్షర కవనమై పూసి
కాగడ కలమై వెలిగి
అడ బిడ్డల చేతిరేఖలను
నుదుటి రాతలను
మార్చేసి
భారతవనిలో విరబూసిన
అక్షర మొగ్గ
అవనియంతట
అక్షరాలను
వెదజల్లి
జ్ఞాన పారిజాతాలకు
పాదుకలు చేసి
చరిత్రలో చెరగని
నామమై
అక్షరానికి
నిలువెత్తు సంతకమై
నిలిచిన
సావిత్రి పూలే
ఆమె చల్లిన పూలే
ఈ కవనమందు
కదలాడే మేధావిరాజాజులు.
*********************
భారత దేశపు ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రి బాయి పూలే
రచన: మధురకవి గుండు మధుసూదన్
.
తేటగీతులు:
.
భరతదేశమ్మునందునఁ బ్రథమ మాని
నీ యుపాధ్యాయి సావిత్రి బాయి ఫూలె
సాహసమ్మునకును సమాజావసరపు
టుద్యమమ్ము నడపినట్టి సద్యశోధి!
.
ఆమెనుం గూర్చి ముచ్చట లాడకుండ
స్త్రీల స్వేచ్ఛాసమానత్వ లీలఁగూర్చి
మాటలాడఁగలేరయ్య మహిళ లెపుడుఁ
దమకు స్వేచ్ఛ నొసంగిన దైవమగుట!
.
మును మహాత్ముఁడౌ జ్యోతిబా ఫూలె తోడఁ
దన వివాహమ్ము జరిగిన తదుపరి తన
జీవితమె మాఱిపోయె! సుశ్రేష్ఠుఁడైన
భర్త యడుగు జాడలఁ జరింపఁగఁ దలంచె!
.
కుల వివక్షతకు వ్యతిరేకులయి జ్యోతి
రావు ఫూలె దంపతులు విరామ మిడక,
వంచనకు గుఱియైనట్టి బాధితులనుఁ
జేరఁదీసి, వెతలఁదీర్చి, స్థిరత నిడిరి!
.
చదువుకొనుటకునుఁ గుటుంబ సభ్యులెంత
వ్యతిరిక్తతఁ జూపించి, వంకలిడిన,
ధైర్యముగ నిలఁబడి, భర్తృనాజ్ఞఁ
బడసి, సామాజికోద్యమ పాత్రనుఁ గొనె!
.
భర్త నుండియుఁ బ్రశ్నించు స్పందనలను
నేర్చుకొని, యగ్ర కులపు మన్నెఱికముపయిఁ
దిరుగఁబడి, ఛీత్కృతులు, ఱాళ్ళ దెబ్బలెన్నొ
లెక్క సేయక, తాఁ బ్రజ్వలించె నపుడు!
.
అల్ప కుల బాలికలను సమాదరించి,
చదువు నేర్పె! కార్మికుల, కర్షకుల కొఱకు
రాత్రి పాఠశాలలను ప్రారంభపఱచి,
వెలుఁగు లిడి, తాను వెలిఁగె సావిత్రిబాయి!
.
అగ్ర కులములందున్నట్టి యధవలకును
మూర్ధజమ్ములఁ బట్టియు ముండనమునుఁ
జేయ నెదిరించి, మాన్పంగఁజేసి, వారి
యార్తినిం బాపి, రక్షించె నమ్మవోలె!
.
విధవలకు శరణము నిడు వేశ్మములను
స్థాపనము సేసి, చదువులఁ జక్కపఱచి,
వారి కాళ్ళపై వారి నిల్వంగఁజేసి,
బ్రతుకు నిచ్చి కాపాడె వరాల తల్లి!
.
పూణెలోఁ బ్లేగు వ్యాపింపఁ బోరి తాను
తనదు తనయుని సాయమ్ముఁ గొనియు వేగఁ
బ్రజలఁ గాపాడి, చివర కా వ్యాధిసోఁకి,
ప్రాణము ల్వీడి, తానేఁగె స్వర్గమునకు!
.
అట్టి యసహాయ శూరకు, నట్టి ధీర,
కట్టి సంస్కర్త్రి, కట్టి మహాత్మ, కట్టి
మాత, కట్టి సన్నుత దయామయికి నేను
వందనము సేతు నిరతమ్ము డెందమందు!
స్వస్తి
***********************
భాస్కర బాలభారతి


సావిత్రీబాయి పూలే

తొలిమహిళా ఉపాధ్యయిని
అట్టడుగు వర్గ మహిళల
ఆరాధ్యదైవం !
బడుగువర్గాల అభ్యున్నతికై
ధిక్కర స్వరంపెంచిన
ధీరవనిత !
అక్షరాల అంకుశంతో
నిరక్షరాస్యత నిర్మూలించి
నిరక్షర కుక్షులలో
అక్షర జ్యోతి వెలిగించివెలుగుల
వెలుగు !.
బాలవధువుగా జోతీరావుపూలే
జతకట్టి
తోటి బాలికా వధువులవెతల
దీర్చ
వితంతుస్త్రీల విధిరాత బాప
అక్కున జేర్చి సేదదీర్చిన
బహుదొడ్డ ఇల్లాలు !
క్షురకుల చైతన్య పరచి
వితంతువుల శిరోముండన
బాధలరజ్జువుల ముడుల
విప్పజేసిన సాహసి ఆమె
కులాంతర వితంతువుల
వివాహాల జరిపించిన
అపరవీరేశలింగము ఆమె
ఆమెయే మనస్త్రీజాతి గర్వించదగిన సావిత్రిబయి పూలే !!
******************************************

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆదర్శమూర్తి.....సావిత్రీబాయి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ఆదర్శమూర్తి అందుకో వందనం 
బడుగు బలహీనవర్గాల బాగుకోసం                              నీభవిత మరచి బాగుచేసిన 
భారతనారీవమ్ము   
మూఢాచారాలకు,
మూఢ విశ్వాసాలకు                       
చరమగీతం  పాడిన శాంతమూర్తివమ్మా.                   మాతృదేశమున  మణిహారమై,               
అణ గారిపోతున్న అబల జీవితాన్ని             
అందల మెక్కించి ఆదుకున్నావు.               
భావి తరానికి బ్రతుకు నిచ్చావు.                            ఇలలోన ఇంతులనుతీర్చి దిద్దావు.
అందుకో  ఆదర్శనారీ ,
నీకు మా జోహార్లు జోహార్లు!!

ఎ.భాగ్యచంద్రిక.
🍁💥🍁✍

******************************

రచన కంటే నిరంజనయ్య

******************
అమ్మా ! సావిత్రి భాయి పూలే ! 
********************
- పల్లోలి శేఖర్ బాబు 9490484316. 

అమ్మా !
సావిత్రి భాయి పూలే
స్ర్తీ జాతిలో మణి రత్నానివి
సమాజ హితకారిణివి
సంస్కరణోధ్యమ సిఫాయివి
ఆదర్శవాదివి అభ్యుదయవాదివి
సమాజ శ్రేయస్సు కోరిన ఓ తల్లీ ! 
నీకు కోటి వందనాలు ! ! 

అజ్ఞాన చీకటిలో మగ్గుతూ
ఆంక్షల చట్రంలో నలుగుతూ
బానిసల్లా బ్రతుకే మహిళలని చూచి
చలించిన ఓ తల్లీ !  
నీకు శతకోటి నీరాజనాలు ! !

చదువు తోనే ప్రగతి అనీ
మూఢత్వచీకటిని తొలగించాలనీ
అక్షర జ్యోతిని వెలిగించాలనీ
భర్త మహాత్మా జ్యోతిరావు పూలే
అడుగు జాడను అనుసరించావు
సమాజాభివృద్ధి కి నడుం బిగించావు
అభాగ్యులను కన్నబిడ్డలుగా పరిగణించావు
నిండు జీవితాన్ని త్యాగం చేశావు

స్త్రీ విద్య ఆవశ్యకతను గుర్తించావు 
సంస్కరణోధ్యమాలు నడిపావు
పాఠశాలలు నెలకొల్పావు
ఆడవారికి అక్షరాభ్యాసం చేశావు 
ప్రతి రక్తపు బొట్టు వినియోగించావు
ప్రగతిశీల సమాజనిర్మాణంకై  పరితపించావు
అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపావు
అనాధలకు ఆశ్రయదుర్గమైనావు

కన్నీటి బతుకుల్లో పన్నీరువైనావు
ఆవేదన పరులకు ఆనంద నిలయమైనావు
సమాజ సేవ ఊపిరి గా జీవించావు 
స్త్రీ అభ్యున్నతే  ఆశయం గా మసలావు
భారతీయ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయావు
ప్రధమ స్త్రీ ఉపాధ్యాయురాలిగా కీర్తి పొందావు

అమ్మా ! సావిత్రి భాయి తల్లీ ! 
నీ గూర్చిఎంత లిఖించినా తక్కువే కల్పవల్లీ ! ! 
చంద్రుని కో నూలు పోగు చందాన ఈ పల్లోలి !
అర్పిస్తున్నాను కవితాంజలి ! !

అమ్మా ! నిన్ను చూడక పోయినా
నీ సేవలు ఆ చంద్రతారార్కం !
నీ బోధలు మా మదిలో పధిలం!
నీ అడుగు జాడల్లో పయనిస్తాం !
నీ స్పూర్తితో జీవిస్తాం!
నీ ఆశయ సాధనకు సమిధలౌతాం !
నీ అమూల్య జీవిత చరిత్రను చాటుతాం !

- పల్లోలి శేఖర్ బాబు కొలిమిగుండ్ల 9490484316. 
*****************************


ఆదర్శనారి
      ☘☘☘☘☘
చదువు సారమెరిగి
సక్కగా సాగిపోయి
చక్కబరిచె ఎందరినో
చదువు జెప్పి సావిత్రి
సకల సారమంతయు
చదువులోనే ఉందంటూ
మహిళలకు మణిహారమై
మర్మంబుదెలిపి చదువునేర్పి
మహిన మగువలంతాచదివినా
వేల్పుగా వెలిగేది మగువలేనని
బడుగు,బలహీన వర్గాలనంత
బాగుజేయ తాను ప్రతిన జేసి
బహు చక్కగాను విద్యనందించి
ఇలలోన ఇంతులను తీర్చిదిద్దె
అందుకే అందుకో ఆదర్శనారీ
నీవెనమ్మా మా సావిత్రిబాయీ.!!!
🌸పూదత్తు భాస్కర్🌸
************************

స్త్రీజాతిఆణిముత్యం  సావిత్రీబాయి
కబంధ హస్తాల విముక్తి సంకల్పం
సంఘశిలి. విరానారి. సావిత్రిబాయి
సాటి స్రీలకు విద్యను బోధిస్తుంటే
పెత్తందారుల విమర్శలకు
ఎదురొడ్డి నిలిచిన వీరనారి సావిత్రిబాయి
విద్యా విజ్ఞాన జ్యోతిని స్త్రీ లోకానికి
అందించిన మొదటి ఉపాధ్యాయినిరాలు
మాఅమ్మ సావిత్రిబాయి
అగ్రకుల నీచబుద్ధి ని
నిలువునా కాల్చిన అసలైన
సత్యశోధకురాలు
మాతృ మూర్తి   సావిత్రి భాయి
చదువుల తల్లి   సావిత్రిబాయి
ఈ సమాజ స్త్రీ శక్తి
ఈ జగత్తు ఆదిశక్తి
అంతానూ అమ్మ సావిత్రిబాయి 
            ✍ ఉప్పరి తిరుమలేష్
************************
రచన : ఫర్జానా

****************

*సావిత్రిభాయ్ ఫూలే* 

అక్షరాష్యంతోటి 
ప్రజలను 
సామరస్యం నింప 
మట్టి చీరను కట్టి బడికి నడిచి 
దళితవాడలను వెన్నుతట్టి నిలిచి
అమాయకత్వాన్ని తుడిచి 
రాళ్ళ దాడులు ఎదుర్కొని 
అక్షరోదయంతో 
విజ్ఞాన వెలుగులను నింపి 
అగ్రవర్ణాల ఆగడాలను త్రుంపి
కర్షక కష్టాలకు తరిమేయ వేగుచుక్కై మెరిసి 
కనుమూసిన భర్త చితికి తనే నిప్పంటించి
సమాజంలో మూఢనమ్మకాలను కాల్చి 
ప్లేగు వ్యాధి పిల్లలను ప్రేమించి 
ఆకలిని తీర్చా అన్నపూర్ణ గా నిలిచి
తన జీవితాన్ని సేవలోనే ఒలిచి 
కాలగర్భంలో కనుమరుగైపోయి 
మొదటి మహిళా ఉపధ్యాయినివై 
నేటీ మహిళా ప్రపంచానికి ఆదర్శమై నిలిచిన 
సావిత్రిభాయ్ ఫూలే గారికి 
పాదాభివందనం
                        *అభిరామ్*
********************************

🌸మహాసాద్వి మన సావిత్రి🌸

మహిళల ఆదిగురువు మన సావిత్రి
ఆత్మ పరమాత్మలను బోధించిన ఆత్మపరిశోధకురాలు
కన్యాశుల్కం పై కయ్యము చేసిన కలికి
స్త్రీ విద్య పై ఉప్పెనలా మారిన మొదటి ఉవిధ
మూఢనమ్మకాలపై తెగబడినన తెగువంతురాలు
పాఠశాలను ప్రతిష్టించి విద్య పరిమళం ను అందించిన వనిత
సతిసహగమనముకు సాహసించిన సాద్వి
సదమదమవుతున్న స్త్రీ జాతికి సదా సంజీవిని
నిర్మలహృదయంతో నిశ్చల మనస్సుతో నీకు మా నమసుమ్మాంజలి.....

       ✍ తెలుగు తిరుమలేష్
            9908910398
***************************

సావిత్రి బాయి ఫూలే
కుసుమంచి శ్రీదేవి
--------------------
పారదర్శకత లేని 
సాంప్రదాయాలతో.,
స్త్రీల ఎదుగుదలను
అణచి వేసే కట్టుబాట్లుతో
బంధీ అయి..
చీకటి గదులకే
పరిమితమైన
నాటి మహిళల లోకానికి
తన ధైర్యాన్ని
ఆయుధంగా మలచి
ఈ చీకటి కంచెలను
చీల్చి,.చండాడి..

వారిపై అక్షర కాంతిపుంజాలను
వెదజల్లి,.
వారిజీవితాలను
కాంతి మయం చేసిన
ఓ మహిళా కాంతి పుంజం
సావిత్రిబాయి ఫూలే...

భర్త అడుగుజాడలలో
నడుస్తూ...
సరికొత్త సాంప్రదాయిన్ని
మగువలకి పరిచయం చేసి..
తమలో దాగివున్న
మనోనిధితో విజ్ఞానం
వైపు అడుగులు వేయమంటూ...
తొలి మహిళ గురువమ్మగా
అవతారమెత్తి...
మహిళా లోకానికి
ఆదర్శమైన మహిలా జ్యోతి
సావిత్రి బాయి ఫూలే...

అనాధలకే అమ్మై
భర్త ఆశయాలకు ఊపిరై
తన కవితలతో విప్లవజ్యోతై
ప్లేగు వ్యాధిగ్రస్తుల పాలిట నైటింగేలై
ప్లేగు మహమ్మారే తన ప్రాణాలను
కబలించిన ...
కొన ఊపిరి వరకూ సేవకే
అంకితమైన మహా వనిత
మన సావిత్రి బాయి ఫూలే....
***********************
ధీర వనిత..

ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన వనిత
స్ర్తీ అభ్యుదయానికి నడుం బిగించి
బాల్య వివాహం జరిగినా
భర్త ప్రోత్సాహంతో చదువు కొనసాగించి,చదువు చెపుతూ
మంచి తనమే అలంకార మైన అతివ
ఛీత్కారాలు ఎదురైనా ధైర్యాన్ని  కోల్పోకుండా 
ఛీదరించిన వారే పొగిడేలా చేసుకొని
అవమానాలను విజయానికి నాంది గా మార్చుకున్న ధీశాలి
అంటురోగం సోకిన రోగికి సేవచేసి 
సేవాధృక్పతమే తన సంతోషంగా భావించిన సౌశీల్యవతి
అదే అంటురోగంతో స్వర్గానికేగెనోయి
మన సావిత్రిభాయి పూలే...

       ✍.....సత్యనీలిమ...
              ఉపాధ్యాయురాలు
               జీనియస్ పాఠశాల
                 వనపర్తి...
************************

*

పాలకుర్తి నాగజ్యోతి
05/01/18

ధీశాలి...


అక్షరాన్ని నమ్ముకున్న అతివవై
అక్షరాల నిరసన కంచెను తెంపిన ధీశాలివి..
అక్షరాల వెలుగును పంచిన మొదటి ఉపాధ్యాయివి..

అమ్మలోని కన్నపేగు కరుణవు నీవయితే
అభాగ్యులంతా నీ ఒడిలోనే సేదదీరగా
పిల్లలు లేరనే మాట చిన్నదై నీకు దూరంగా పారిపోయెను...

మట్టిని కట్టుకున్న చీర
మట్టిలోని మాణిక్యాలను వెలికితీయగా 
నిరసన జ్వాలలు రగిలే కాలపు చెట్టును 
కూకటి వేళ్ళతో పెకిలియ్యబూనిన ధీరవనితవు...

సామాజిక చైతన్యపు దీపికవై
నీలోని చీకటికి పూసిన కాంతివై
ప్రాణాలకు ప్రాణమిచ్చిన ప్లేగు త్యాగానివై
పూనె ను చరితలో నిలిపిన శ్రీమతి జ్యోతిరావ్ ఫులె వై
సంప్రదాయాల నమ్మకాన్ని తలకొరివితో తిరగరాసిన సావిత్రి ఫులె గా నువో అభ్యుదయవాదివి...

@సిరిమల్లెలు...
*****************

శీర్షిక : *తొలి మహిళావైతాళిక*

ప :అమ్మా!..... సావిత్రీబాయీ పులే ...!
మహిలా చైతన్య శీలి! విప్లవ వైతాళికపులి!
                               !!అమ్మా !!

1.ఓనమాలు దరిచేరని అబలల అజ్ఞాతంలో
మూఢనమ్మకాలు ముసురుకున్న అంధకారంలో 
అగ్రవర్ణాహంకారుల ఆగడాల ఏలుబడిలో 
వెలియై బలియై నలిగిన  దలిత శూద్ర బహుజనులను 
అదుకొన్న కరుణామయి!జ్ఞాన ప్రసాదినివాణి
                               !!అమ్మా !!

2.పట్టుదల జిజ్ఞాసలు నీ తోబుట్టువులు కాగ
జ్యోతిబా సాహచర్య విద్యా విప్లవ శక్తివి
బహుజన చైతన్యానికి "మహిళాసేవామండలి"
బాధిత మహిళా కూనల.            
"బాలహత్య ప్రతిబంధక్"
సాటిలేని నీ పాత్ర "సత్యశోధ సమాజము"న
బాలికలకు బడులు పెట్టి తొలి భోధకురాలవైతి   
                                !!వమ్మా!!
                               
3.జ్యోతిబా పులే ఆశయసాధన జ్యోతివమ్మ
జీవితమంతా సమాజ సేవకు అంకితమమ్మా
నీ స్పూర్తి బహుజన మహిళాలోకానికి విముక్తి
సమ సమాజ నిర్మాణములో అది చోదకశక్తి 
                               !!అమ్మా !!

రచన-మధుసూదన్ కోమటి,
                 ఎస్ ఏ (తెలుగు),
ప్రభుత్వ ఉన్నత పాఠశాల (డైట్) నల్లగొండ,
చరవాణి 9491328432.
***********************

🌷🙏🌷

-     ----------------------------------
       *"అక్షర జననీ సావిత్రి "*
      ------------------------------------

కం.
అక్షర జననివి నీవే,
సాక్షాత్కారముగా నిలిచిన సావిత్రీనిన్,!
శిక్షణ నిమ్మా !మాకు "ని
రక్షర" కుక్షులకు విద్య రాగలదనుచున్,!!

కం.
విద్యయె భూషణ మనుచును,
విద్యల నేర్చినవివేకి వేదన లేకన్,!
విద్యల విలువను దెలిపియు
విద్యను నేర్వగ నడిపిన వేల్పువనందున్.!!

ఆ.వె
అంటరాని వారి ఆనంద వాహినీ,
అక్షరాలు నేర్పి యవనినిల్పి
చదువుతోనె గల్గు సంస్కార మనిజెప్పి
చదువజేసి నావె చక్కగాను.

ఆ.వె.
జనుల సంస్కరింప సాగిన సావిత్రి, 
బాధలెన్నొ నీవు బడసినావె
బాగుజేసినావె బంగారు బాలలన్
విద్య నేర్పినావె వీధులందు.

🌷
----------------- *అంబటి భానుప్రకాశ్.*
                         9948948787.

*******************************


Comments

  1. తెలుగు కవన వేదిక కవులకు అభినందనలు .చక్కని కవిత్వంతో అలరిస్తున్నందుకు.
    అంబటి భానుప్రకాశ్.
    9948948787.

    ReplyDelete

Post a Comment